Chess Olympiad: చెన్నైలో చెస్ ఒలంపియాడ్ పోటీలు.. ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
Prime Minister Started the Chess Olympiad Competitions: ప్రపంచ చెస్ పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ చదరంగ పండుగ ప్రారంబోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్,సినీ నటుడు రజినీ కాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 190 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
చెస్ ఒలంపియాడ్ టోర్నీని భారత దేశంలో మొట్ట మొదటి సారిగా నిర్వహిస్తుండటంతో.. ఏర్పాట్లను సీఎం స్టాలిన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ టోర్నీకి తమిళనాడు ప్రభుత్వం 100 కోట్లను కేటాయించింది. ‘తమిళతంబి’ పేరుతో గుర్రం ముఖం రూపంలో ఓ చిహ్నాన్ని ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారులు.. దాని నమూనాలను నగరం నలుమూలలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మంత్రులు, ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
చెస్ పోటీలు శుక్రవారం నుంచి ఆగస్టు 10 వరకు జరుగనున్నాయి. వీటిలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో క్రీడాకారులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. భారత్‌తో పాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, మలేషియా, ఒమన్, డెన్మార్క్‌తో పాటు మొత్తం 190 దేశాల నుంచి క్రీడాకారులు వచ్చారు.