Basara: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
Basara IIIT.. బాసర ట్రిపుల్ ఐటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆందోళనలు కొనసాగిస్తున్న విద్యార్థులను పరామర్శించేందుకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులను దాటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన ఎంపీ సోయం బాపూరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
మరోవైపు కొన్ని రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చిన ప్రభుత్వం ఆ మాటను మర్చిపోయిందని విద్యార్థులు అన్నారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని పట్టుబట్టారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అనంతరం ప్రభుత్వ అధికారులు మెస్ నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
విద్యార్థుల ఆందోళనకు పేరెంట్స్ కమిటీ సైతం మద్దతు తెలిపింది. తమ పిల్లలు భోజనం చేసేంత వరకు తాము కూడా భోజనం చేయమని వారు స్పష్టం చేశారు. విద్యార్థులను పట్టించుకోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిముందు మౌన దీక్ష చేస్తామన్నారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించే వరకూ తాము ఆందోళన చేపడుతామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఓ విద్యార్థి మృతి చెందాడని వారు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.