Jayashankar University: జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 20 మంది విద్యార్థులు సస్పెన్షన్
Jayashankar University Raging:ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ర్యాగింగ్ భూతం మాత్రం వదలటంలేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో గల ఫ్రొఫేసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థులపై 20 మంది సీరియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో జూనియర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడ్డ 20 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో 13 మంది విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయగా.. మరో ఏడుగురు విద్యార్థులను ఒక సెమిస్టర్ పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తమను సీనియర్లు హాస్టల్‌లోని వారి రూమ్‌కు పిలిపించుకొని వికృత చేష్టలకు పాల్పడ్డారని విద్యార్థులు వాపోయారు. మరోవైపు ర్యాగింగ్‌పై ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కళాశాలల యాజమాన్యాలు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల ఈ ర్యాగింగ్ భూతం విద్యార్థులను వదలడం లేదు. కొంతమంది ర్యాగింగ్ తట్టుకోలేక చదువు మానేస్తే.. మరికొంత మంది మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోతోంది.