Telangana BJP : తెలంగాణపై బీజేపీ ఫోకస్… రంగంలోకి హైకోర్టు న్యాయవాది
BJP High Command Special Focus on Telangana : తెలంగాణపై గట్టిగ ఫోకస్ చేసిన బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి అవకాశాన్ని వదలడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ సర్వేలు నిర్వహించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వేట మొదలుపెట్టారు కమలనాథులు. ఈ సర్వేల ఆధారంగా నేతలకు గాలం వేస్తున్నారు. సర్వేల ఆధారంగా ఆయా నియోజక వర్గాల్లో నేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీకి కేంద్ర నేతల ఆదేశాలు అందాయి. గోవా మోడల్ ఫాలో అవుతున్న బీజేపీ విభేదాలను పక్కన బెట్టి బలమైన నేతలను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది రచన రెడ్డితో పాటు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఈ ఆదివారం కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరబోతున్నారు. అంతేకాదు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఆగష్టు 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర మొదలుకానుంది. యాదగిరిగుట్ట నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్టుగా బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.