Commonwealth Games: పాక్‌పై భారత్ ఘన విజయం
CWG 2022 IND VS PAK: కామన్‌వెల్త్ క్రీడల్లో భాగంగా పాక్‌తో జరిగిన కీలక సమరంలో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ మెరుపు వేగంతో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన 42 బంతుల్లో 63 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సర్లతో విధ్వంసం సృష్టించడంతో భారత్ మరో 38 బంతులుండగానే 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 16 పరుగులు చేసి అవుట్ కాగా, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి మంధన స్కోరుబోర్డు ముందుకు నడిపించింది. మేఘన 14 పరుగులు చేసింది. అంతకుముందు, వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. సరిగ్గా 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ విజయంతో భారత టీమ్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అటు, వరుసగా రెండో ఓటమితో పాక్ జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. భారత్ అమ్మాయిలు తమ తరువాతి మ్యాచ్‌ను ఆగస్ట్ 3న బార్బడోస్ జట్టుతో ఆడనున్నారు.