Raghuram Rajan: దేశ ఆర్థిక వృద్ధిపై రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Raghuram Rajan is Former Governor of RBI: భారత ఆర్థిక వృద్ధిపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ఆర్థిక పురోగతికి ఇది ఎంతో అవసరమని రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐతే మెజారిటీవాదం బలపడి.. ఒకదేశ రాజకీయ నాయకులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే భారత్‌లో కూడా శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని రఘురామ్ రాజన్ తెలిపారు. దేశ వృద్ధిరేటు మందగించడానికి కొవిడ్19 సంక్షోభం ఒక్కటే కారణం కాదన్న ఆయన.. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదన్నారు. యువకులకు అవసరమైన స్థాయిలో ఉద్యోగాలు సృష్టించలేకపోవడమే దీనికి అసలైన కారణమన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో చెప్పడానికి కొత్త సైనిక నియామకాల పథకం ‘అగ్నిపథ్’పై చెలరేగిన ఆందోళనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.