PM Modi : ఆగస్ట్ లో ప్రొఫైల్ పిక్చర్‌గా ‘తిరంగా’… మోడీ సూచన
Use ‘Tiranga’ as profile picture between Aug 2-15 : 75వ స్వాతంత్య్ర వేడుకలకు ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఘనంగా జరపడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆజాదీ కా అమృత మహోత్సవం అంటూ దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహాత్ములను గుర్తు చేసుకుంటూ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మరో ఆసక్తికర కార్యక్రానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఆగస్టు 13-15 తేదీల మధ్య ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని నిర్వహించనున్నామని, ఆగస్టు 2వ తేదీ నుంచి అందరూ సోషల్ మీడియా ఖాతాల్లో ‘తిరంగా’ను తమ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కోరారు. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ఆగస్టు 13 నుండి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా మన ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళదాం” అని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ‘మన్ కీ బాత్’లో ప్రసంగిస్తూ అన్నారు.
“ఆగస్టు 2న జాతీయ జెండాను రూపొందించిన పింగిళి వెంకయ్య జయంతి. అందుకే ఆగస్ట్ 2 నుంచి ఆగస్టు 15 మధ్య సోషల్ మీడియా ఖాతాలలో ‘తిరంగా’ని ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించాలని నేను అందరినీ కోరుతున్నాను”అని ఆయన అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం 91వ ఎడిషన్ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం ఒక అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యమిస్తోందని అన్నారు.
ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తన నెలవారీ రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ 91వ ఎడిషన్ లో ప్రసంగించారు. మోదీ ముందుగా ఒక ట్వీట్‌లో “ఈ నెల 31న జరిగే #మన్‌కీబాత్‌కు ట్యూన్ చేయడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఉదయం 11 గంటలకు గత నెల నుండి అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయాలు, క్రీడా మైదానంలో వైభవం, రథయాత్ర వంటి ఆసక్తికరమైన అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను కూడా షేర్ చేస్తున్నాము” అంటూ రాసుకొచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అధికారిక ప్రయాణం 2021 మార్చి 12న ప్రారంభమైంది. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్ గా గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, 2023 ఆగస్టు 15న పూర్తవుతుంది.