CV Anand : అర్ధరాత్రి 100కి కాల్ చేసి కమీషనర్ ఫిర్యాదు
Hyderabad CP calls dial 100 : సాధారణంగా సామాన్య పౌరులు ఏదైనా సమస్య వస్తే 100కి కాల్ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ పోలీసులే డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, అదికూడా ఓ పోలీస్ ఉన్నతాధికార. తాజాగా అలాంటిదే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ డయల్ 100 కాల్ చేశారు. తన నివాస ప్రాంతంలో సౌండ్ పొల్యూషన్ ఆపాలని డయల్ 100 ద్వారా సీపీ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ప్లజెంట్ వ్యాలీలో నివాసముంటున్న సీపీ సీవీ ఆనంద్ అర్ధరాత్రి డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం చేస్తున్నారని డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయడం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది.
జూబ్లీహిల్స్ డిఐ శ్రీనివాస్ నైట్ డ్యూటీ లో ఉండగా, అక్కడి పోలీసు సిబ్బంది వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఓం నగర్ బస్తీలో తొట్టెలు ఊరేగిస్తూ అర్ధరాత్రి డప్పులతో శబ్ద కాలుష్యం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిర్వాహకుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని 70B కింద కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.