Chikoti Praveen: ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్
Casino Case:తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన కేసినో కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. చీకోటి ప్రవీణ్ తోపాటు మరి కొందరిని విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి, వారిని విదేశాల్లో క్యాసినో ఆడించి లాటరీ డబ్బులను పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. మూడు రోజలుగా చీకోటి ప్రవీణ్ ఇంటితో పాటు, అతనికి సంబంధించిన అనేక ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఇందులో భాగంగా మొత్తం చీకోటి ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి, సంపత్‌ను కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరు కొద్ది సేపటి క్రితమే ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. విదేశాల్లో క్యాసినో పై ఈడీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు నిర్వాహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రవీణ్, మాధవరెడ్డిలకు హవాల రూపంలో సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ అనే నలుగురు ఏజెంట్లు నగదు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం సేకరించిన అధికారులు, చీకోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. చీకోటికి చెందిన నాలుగు బ్యాంకు అకౌంట్లను ఉన్నట్లు గుర్తించారు. ఈ అకౌంట్ల ద్వారా పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లు తెలుస్తోంది.