Link Roads Programme: 2,410 కోట్ల వ్యయంతో 104 కారిడార్ల నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2,410 కోట్ల వ్యయంతో 104 కారిడార్లు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రధాన మార్గాలకు చేరుకునేందుకు లింక్ రోడ్ల నిర్మాణానికి పురపాలక శాఖ పరిపాలనా పరమైన అనుమతులను మంజూరు చేసింది. కొత్తగా చేపట్టే కారిడార్ల పరిధిలో అనేక లింకు రోడ్లు ఉంటాయి. మిస్సింగ్ లింక్ రోడ్స్ ప్రోగ్రామ్ ఫేజ్ 3 లో భాగంగా ఈ పనులు జరగనున్నాయి.
మొదటి దశలో 50 రోడ్లు కారిడార్ల నిర్మాణం
మొదటి దశలో రూ.1,500 కోట్లతో ఐదు ప్యాకేజీల కింద వెంటనే 50 రోడ్లు, కారిడార్ల నిర్మాణం ప్రారంభించనున్నారు.
మొదటి ప్యాకేజీ కింద 304 కోట్ల రూపాయల వ్యయంతో 25.20 కిలీమీటర్ల పొడవున 7 కారిడార్లను నిర్మిస్తారు. రెండో ప్యాకేజీ కింద 330 కోట్ల వ్యయంతో 27.20 కిలోమీటర్ల పొడవున 10 కారిడార్లను నిర్మిస్తారు. అదే విధంగా ప్యాకేజీ 3 కింద 417 కోట్ల వ్యయంతో 33.35 కిలోమీటర్ల పొడవున 13 కారిడార్లను నిర్మిస్తారు. ప్యాకేజీ 4లో 11 కారిడార్లను నిర్మిస్తారు. 24.64 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ కారిడార్లకు 297 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ఇక ప్యాకేజీ 5 కింద 9 కారిడార్ల నిర్మాణం జరగనుంది. 10.53 కిలోమీటర్లు ఉండే ఈ కారిడార్ల నిర్మాణానికి 120.92 కోట్ల వ్యయం కానుంది.
హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ పనులు జరగనుననాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ ఈ పనులను అవసరమైన ఖర్చును సమకూర్చనుంది. పలు ఆర్ధిక సంస్థల ద్వారా లోన్లు తీసుకుని HMDA పనులను ప్రారంభించనుంది.
లింక్ రోడ్ల నిర్మాణపు మొదటి దశ, రెండో దశ విజయవంతం అయ్యాయి. దీంతో ప్రస్తుతం మూడో దశను ప్రారంభిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాలతో పాటు సమీపంలోని 10 యూఎల్‌బీలలో 104 కారిడార్లను నిర్మిస్తారు.