NV Ramana: రావి శాస్త్రి కవిత్వం నా హోదా కన్నా చాలా గొప్పది
తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటే మాండలిక భాషను వాడుకలో ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. విశాఖలో రావి శాస్త్రి శతజయంతి సభలో జస్టిస్ ఎన్ వి రమణ ప్రసంగించారు. అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రావి శాస్త్రి కవిత్వం ముందు తన హోదా కూడా గొప్ప కాదని తన అభిప్రాయమని అన్నారు. రావి శాస్త్రి సూక్తులను విశాఖలో శాశ్వతంగా గుర్తుండేలా నిర్మించాలని ఆకాంక్షించారు. ఈనాటి సమాజం ఎక్కువగా గిరీషాలతో నిండి పోయిందని అప్పట్లోనే చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారని, ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పు లేదని అన్నారు.
లా కంటే సమాజాన్ని ఎక్కువగా చదివిన న్యాయవాది రావి శాస్త్రి అని ఎన్వీ రమణ పొగిడారు. తాను కూడా లా కళాశాల తరగతి గదులకంటే సామాజిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టే వాడినని గుర్తుచేశారు. ఆగస్టు 27న పదవి విరమణ చేయబోతున్న నేపథ్యంలో పనుల ఒత్తిడి ఉండడంతో ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నానని, పదవీ విరమణ తర్వాత విశాఖ వచ్చి ఎక్కువ సమయం గడుపుతానని తెలిపారు. తెలుగు భాషను పరిరక్షించేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
తీర్పుకు కేవలం సాక్ష్యా ధారాలు మాత్రమే కాదని, అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని రావి శాస్త్రి చెప్పే వారని ఎన్వీ రమణ గుర్తుచేశారు. నిజం హత్యకు గురైతే దేవుడే న్యాయం చేస్తాడని చెప్పే విధంగా రావిశాస్త్రి తన కథనాల్లో చెప్పే వారని రమణ తెలిపారు. రాజ్య ధిక్కరణ కేసు సెక్షన్ 124 తాత్కాలిక రద్దు వెనక రావిశాస్త్రి ప్రభావం కూడా ఉందని తెలిపారు.